జిమ్మీ లాయ్‌ను వదిలేయండి.. చైనా అధినేత జిన్‌పింగ్‌ను కోరిన డొనాల్డ్ ట్రంప్

  • జిమ్మీ లాయ్ విడుదలపై రంగంలోకి ట్రంప్
  • చైనాపై అమెరికా, బ్రిటన్ ఒత్తిడి
  • జాతీయ భద్రతా చట్టం కింద లాయ్‌ను దోషిగా తేల్చిన కోర్టు
హాంకాంగ్‌కు చెందిన ప్రజాస్వామ్యవాద వ్యాపారవేత్త జిమ్మీ లాయ్ విడుదల విషయాన్ని పరిశీలించాలని తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హాంకాంగ్ వివాదాస్పద జాతీయ భద్రతా చట్టం కింద 78 ఏళ్ల లాయ్‌ను కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. "ఆయన గురించి నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయంపై నేను అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడాను. ఆయన విడుదలను పరిశీలించాలని కోరాను" అని తెలిపారు. లాయ్ వృద్ధుడని, ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదని పేర్కొన్నారు. 

మరోవైపు, బ్రిటన్ కూడా జిమ్మీ లాయ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లాయ్ బ్రిటన్ పౌరుడు కావడంతో ఈ తీర్పును తీవ్రంగా ఖండించింది. ఇది "రాజకీయ ప్రేరేపిత వేధింపు" అని బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్టే కూపర్ అభివర్ణించారు. తమ నిరసనను బలంగా తెలియజేసేందుకు చైనా రాయబారిని పిలిపించి మాట్లాడినట్లు ఆమె తెలిపారు.

విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలతో హాంకాంగ్ కోర్టు లాయ్‌ను నిన్న దోషిగా తేల్చింది. ఈ తీర్పును హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ స్వాగతించగా, హక్కుల సంఘాలు మాత్రం దీనిని 'క్రూరమైన న్యాయ ప్రహసనం'గా విమర్శించాయి.

డిసెంబర్ 2020 నుంచి జైలులో ఉన్న లాయ్‌కు వచ్చే ఏడాది ఆరంభంలో శిక్ష ఖరారు కానుంది. ఈ కేసులో ఆయనకు గరిష్ఠంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News