నాకు అంత్యక్రియలు చేయండి: చనిపోయిన వారి జాబితాలో పేరు ఉండటంపై కౌన్సిలర్ ఆందోళన

  • ఓటరు జాబితాకు సంబంధించి చనిపోయిన, వలస వెళ్లిన వారి జాబితా విడుదల
  • చనిపోయిన వారి జాబితాలో డాంకూని మున్సిపాలిటీలోని 18 వార్డు కౌన్సిలర్ పేరు
  • ప్రజాప్రతినిధికే ఇలాంటి అనుభవం ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్న
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో తన పేరును మరణించిన వారి జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఒకరు కోల్‌కతాలోని శ్మశానవాటికకు వెళ్లి తనకు అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల జాబితాను బూత్‌ల వారీగా విడుదల చేసింది.

ఈ జాబితాలో డాంకూని మున్సిపాలిటీలోని 18వ వార్డు కౌన్సిలర్ సూర్యదేవ్ తన పేరు మరణించిన వారి జాబితాలో ఉండటం గమనించారు. దీంతో సూర్యదేవ్ నేరుగా శ్మశానవాటికకు వెళ్లి, తన పేరును మరణించిన వారి జాబితాలో చేర్చినందున తనకు అంత్యక్రియలు జరపాలని కోరారు.

ఎన్యూమరేషన్ ఫారమ్‌లో వివరాలను బీఎల్ఓకు అందజేసినప్పటికీ తన పేరును తొలగించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధికే ఇలాంటి అనుభవం ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ పేరు తొలగింపు వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బాధ్యత వహించాలని అన్నారు. ఇలాంటి ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News