టీటీడీ కీలక నిర్ణయాలు... అర్చకుల వేతనం రూ.45 వేలకు పెంపు

  • తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం
  • అర్చకులు, ఇతర సిబ్బంది వేతనాల్లో భారీ పెంపు
  • ముంబై బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయానికి ఆమోదం
  • టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాసులు, మధ్యాహ్న భోజన పథకం
  • రథాలు, ధ్వజస్తంభాల కోసం 100 ఎకరాల్లో దివ్య వృక్షాల పెంపకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి భక్తుల సౌకర్యం, సంస్థాగత బలోపేతం లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించాలని, ముంబైలోని బాంద్రాలో శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు.

సమావేశం అనంతరం ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. భక్తుల కోసం తిరుపతిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ప్లానింగ్, ఆర్కిటెక్ట్ నియామకానికి బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా, ముంబై బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. టీటీడీ ఆలయాల్లోని ధ్వజస్తంభాలు, రథాల తయారీకి అవసరమైన కలప కోసం పలమనేరులో 100 ఎకరాల్లో దివ్య వృక్షాలను పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేశారు.

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట

ఈ సమావేశంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల వేతనాలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం అర్చకుల వేతనాన్ని రూ.25 వేల నుంచి రూ.45 వేలకు, పరిచారకులకు రూ.23,140 నుంచి రూ.30,000కు పెంచారు. పోటు వర్కర్లకు, ప్రసాదం పంపిణీ సిబ్బందికి కూడా వేతనాన్ని రూ.30,000కు పెంచుతూ తీర్మానించారు. శ్రీవారి ఆలయంలో ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టు భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

విద్య, వైద్య రంగాలకు ప్రోత్సాహం

విద్యా, వైద్య రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాల కోసం అదనంగా రూ.48 కోట్లు కేటాయించారు. టీటీడీ ఆధ్వర్యంలోని 31 విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సీసీ కెమెరాల ఏర్పాటుకు, ఎస్వీ జూనియర్, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలల్లో డేస్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇంజినీరింగ్ విభాగంలో 60 పోస్టుల భర్తీకి, శ్రీవారి పోటులో 18 సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరాలని తీర్మానించారు. తిరుమలలోని రహదారులు, కూడళ్లకు వైష్ణవ పురాణాలు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలను పెట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తలకోనలోని సిద్ధేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.14.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిర్ణయాలన్నీ భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, టీటీడీని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడతాయని ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.


More Telugu News