వైజాగ్ వస్తున్న వరల్డ్ ఛాంపియన్లు ఎవరో వెల్లడించిన మంత్రి నారా లోకేశ్

  • డిసెంబరు 21 నుంచి భారత్, శ్రీలంక మహిళల టీ20 సిరీస్
  • తొలి రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న వైజాగ్
  • టీమిండియాకు స్వాగతం పలుకుతూ మంత్రి లోకేశ్ ట్వీట్
  • వరల్డ్ కప్ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైందని వెల్లడి
మహిళల ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టు, ఆ ఘనత తర్వాత తమ తొలి సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ భారత జట్టుకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.

భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఈ నెల 21 నుంచి 30 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఇందులో తొలి రెండు మ్యాచ్‌లు డిసెంబర్ 21, 23 తేదీల్లో విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లోకేశ్ తన సంతోషాన్ని పంచుకున్నారు. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ ప్రయాణం విశాఖ నుంచే ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు.

"ఛాంపియన్లకు స్వాగతం. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ ప్రయాణం మన విశాఖలో నెల రోజుల క్యాంపుతోనే మొదలైంది. ఇప్పుడు విశ్వవిజేతలుగా నిలిచాక తమ తొలి మ్యాచ్‌లను ఇక్కడే ఆడుతున్నారు" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం "వైజాగ్‌కు వరల్డ్ ఛాంపియన్లు వస్తున్నారు, ఎవరో చెప్పుకోండి" అంటూ ఆయన చేసిన ట్వీట్ ఆసక్తి రేపిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో ఈ మ్యాచ్‌లపై అంచనాలు పెరిగాయి.




More Telugu News