త్వరలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ: కేంద్రమంత్రి

  • 2026 మార్చిలోపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడి
  • పీఎఫ్ ఖాతాలోని సొమ్ము ఉద్యోగులదేనన్న మన్‌సుఖ్ మాండవీయ
  • ఎటువంటి కారణం చూపకుండా 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చని స్పష్టీకరణ
వచ్చే ఏడాది మార్చిలోగా ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్‌‌ ఉపసంహరణ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈపీఎఫ్ఓ చందాదారులు పీఎఫ్ నిధుల ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏటీఎం, యూపీఐ ఉపసంహరణ సదుపాయం తీసుకొస్తామని గతంలోనే ప్రకటించింది.

తాజాగా, ఒక ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఆయన మరోసారి స్పందించారు. పీఎఫ్ సొమ్ము ఉద్యోగులదేనని, ఈ మొత్తాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను సులభతరం చేయాలని చూస్తున్నామని అన్నారు. ఎటువంటి కారణం చూపకుండా 75 శాతం వరకు పీఎఫ్‌ను ఉపసంహరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఏటీఎం ద్వారా పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. 2026 మార్చిలోపు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును ఉపసంహరించుకోవడానికి ఉద్యోగులు ఎన్నో పత్రాలు సమర్పించవలసి వస్తోందని అన్నారు. ఇప్పటికే ఆధార్, యూఏఎన్ అనుసంధానమయ్యాయని గుర్తు చేశారు. పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా డెబిట్ కార్డుతో ఏటీఎంలో ఉపసంహరించుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.


More Telugu News