ఐపీఎల్ వేలం రోజే వెంకటేశ్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్.. ఫ్రాంచైజీలకు కీలక సంకేతం

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిన వెంకటేశ్ అయ్యర్
  • ఐపీఎల్ 2026 వేలం జరగనున్న రోజే కీలక ఇన్నింగ్స్
  • పంజాబ్‌పై 43 బంతుల్లో 70 పరుగులు చేసిన అయ్యర్
  • ఇటీవలే అతడిని వదులుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
భారత ఆల్-రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ 2026 వేలానికి ముందు తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఇవాళ‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతూ 43 బంతుల్లో 70 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అబుదాబిలో ఐపీఎల్ వేలం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు వెంకటేశ్ ఈ ఇన్నింగ్స్ ఆడటం విశేషం.

పూణెలోని డీవై పాటిల్ అకాడమీలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ తన తుపాన్‌ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా ఆడుతూ జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తాను ఫామ్‌లో ఉన్నాననే గట్టి సంకేతాలు పంపాడు.

2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి వెంకటేశ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ప్రదర్శనతో భారత జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 2023 సీజన్‌లో ఒక సెంచరీతో సహా 404 పరుగులు చేసి ఆకట్టుకున్నా, 2025 సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 142 పరుగులే చేయడంతో రూ. 23.75 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకున్న కేకేఆర్ అతడిని వదులుకుంది.

తాజాగా దేశవాళీ టోర్నీలో రాణించడంతో ఐపీఎల్ వేలంలో అతడిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈసారి వేలంలోకి కేకేఆర్ అత్యధికంగా రూ. 64.30 కోట్ల పర్స్‌తో బరిలోకి దిగుతుండటం గమనార్హం.


More Telugu News