వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • సీఎం చంద్రబాబు, పవన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త
  •  కువైట్ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో శ్రీనివాసులరెడ్డి అరెస్ట్
  •  నిందితుడిపై ఏపీ వ్యాప్తంగా 20కి పైగా కేసులు నమోదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన ఆరోపణలపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్రీనివాసులరెడ్డిని కడప పోలీసులు అరెస్టు చేశారు. కువైట్ నుంచి తిరిగి వస్తున్న అతడిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీనివాసులరెడ్డి, ఎన్నికల ఫలితాల తర్వాత కువైట్‌కు వెళ్ళిపోయాడు. అయితే, అతను తిరిగి భారత్ వస్తున్నాడన్న కచ్చితమైన సమాచారంతో కడప పోలీసులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని నిఘా పెట్టారు. విమానం దిగిన వెంటనే అతడిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు.
 
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై శ్రీనివాసులరెడ్డి తరచూ అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు అతనిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20కి పైగా కేసులు నమోదయ్యాయి. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.


More Telugu News