క్రికెటర్ శ్రీ చరణికి ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

  • ప్రపంచకప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహం
  •  రూ. 2.50 కోట్ల నగదు పురస్కారం ప్రకటన
  •  కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయింపు
మహిళల ప్రపంచ కప్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆమె ప్రతిభను గుర్తిస్తూ భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదు పురస్కారంతో పాటు, కడప నగరంలో 1000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. అంతేకాకుండా, ఆమెకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నిన్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
 
కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నారు. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌తో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమె కనబరిచిన విశేష ప్రతిభకు గుర్తింపుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందించింది.


More Telugu News