కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో లోకేశ్‌ భేటీ.. విశాఖకు ఎన్‌ఎస్‌టీఐ ప్రతిపాదన

  • ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌
  • కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరితో భేటీ
  • విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటుకు వినతి
  • అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లతోనూ సమావేశం కానున్న లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరితో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

విశాఖ జిల్లా పెదగంట్యాడలో 5 ఎకరాల స్థలాన్ని ఈ సంస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందని లోకేశ్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంస్థ ఏర్పాటుతో అధ్యాపకుల అభివృద్ధి, పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి అంశాల్లో ఇది ప్రాంతీయ కేంద్రంగా సేవలందిస్తుందని వివరించారు. అలాగే రాష్ట్రంలో ఎన్‌సీబీఈటీ అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు.

అంతకుముందు పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్న లోకేశ్‌కు పలువురు ఎంపీలు, మంత్రులు స్వాగతం పలికారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో కూడా లోకేశ్‌ భేటీ కానున్నారు. విద్య, ఐటీ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. ఈ సమావేశంలో లోకేశ్‌ వెంట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.


More Telugu News