ఢిల్లీలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ.. కోటను తలపిస్తున్న హోటల్.. కోట్లు పలికిన మీట్ అండ్ గ్రీట్!
- ఢిల్లీకి చేరుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ
- లీలా ప్యాలెస్ హోటల్‌ను కోటలా మార్చిన భద్రతా సిబ్బంది
- మెస్సీతో భేటీకి కోటి రూపాయలు వెచ్చించిన కార్పొరేట్లు
- సీజేఐ, ఎంపీలు, భారత క్రీడాకారులతో ప్రత్యేక సమావేశాలు
మెస్సీ బస చేయనున్న ప్రెసిడెన్షియల్ సూట్‌ల రోజువారీ అద్దె రూ. 3.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆయన బసకు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా హోటల్ సిబ్బందికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో మెస్సీ పర్యటనల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హోటల్ పరిసర ప్రాంతాలను హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చారు.
ఇక, ఈ పర్యటనలో భాగంగా ఎంపిక చేసిన కార్పొరేట్, వీఐపీ అతిథుల కోసం హోటల్‌లో ఒక 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్ ఐకాన్‌ను కలిసే ఈ అవకాశం కోసం కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏకంగా రూ. 1 కోటి వరకు వెచ్చించినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.
ఈ పర్యటనలో భాగంగా మెస్సీ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), పలువురు పార్లమెంటేరియన్లు, క్రికెటర్లతో పాటు ఒలింపిక్, పారాలింపిక్ పతక విజేతలతో సమావేశం కానున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొని, కొంతమంది భారత క్రికెటర్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత పురానా ఖిలాలో అడిడాస్ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ శర్మ, నిఖత్ జరీన్, సుమిత్ అంటిల్, నిషాద్ కుమార్ వంటి భారత క్రీడా ఛాంపియన్లను కలుస్తారు. తన పర్యటన ముగించుకుని సాయంత్రం 6:15 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి, రాత్రి 8 గంటలకు తిరిగి పయనమవుతారు.