బిగ్ బాస్-9... ఈ సీజన్ లో టాప్-5 ఫైనలిస్టులు వీరే!

  • బిగ్‌బాస్ 9 ఫైనల్స్‌కు చేరిన ఐదుగురు కంటెస్టెంట్లు
  • డబుల్ ఎలిమినేషన్‌లో బయటకు వచ్చిన సుమన్‌శెట్టి, భరణి
  • టైటిల్ రేసులో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన
  • మరో వారంలో గ్రాండ్ ఫినాలే... విజేత ఎవరనే దానిపై ఉత్కంఠ
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-9 తుది అంకానికి చేరుకుంది. వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుండగా, హౌస్‌లో టాప్‌-5 ఫైనలిస్ట్‌లు ఎవరో అధికారికంగా తేలిపోయింది. తనూజ, డిమోన్‌ పవన్‌, కల్యాణ్‌ పడాల, ఇమ్మాన్యుయేల్‌, సంజన గల్రానీలు తుది పోరుకు సిద్ధమయ్యారు.

తాజాగా వారాంతంలో జరిగిన డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియతో ఈ ఐదుగురు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. శనివారం ఎపిసోడ్‌లో సుమన్‌శెట్టి ఎలిమినేట్ కాగా, ఆదివారం భరణి హౌస్‌ను వీడారు. దీంతో మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరినట్లు షో వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున ప్రకటించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఇప్పటివరకు తమకు నచ్చిన కంటెస్టెంట్‌లను సేవ్‌ చేసేందుకు ఓట్లు వేసిన ప్రేక్షకులు, ఇకపై టైటిల్ విజేతను గెలిపించేందుకు ఓటింగ్ వేయాలని కోరారు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 9 టైటిల్ పోరు మరింత రసవత్తరంగా మారింది. ఈ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలుస్తారో తెలుసుకోవాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.


More Telugu News