రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగాట్.. ఎక్స్ వేదికగా వెల్లడి

  • లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపిన వినేశ్
  • ఈసారి ఒంటరిగా ప్రయాణించడం లేదని వెల్లడి
  • లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ప్రయాణంలో నా చిట్టి లీడర్ ఉంటాడన్న రెజ్లర్
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఒలింపిక్ కలను నెరవేర్చుకోవడానికి మళ్లీ రెజ్లింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు తెలిపింది. 2028లో లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లు 'ఎక్స్' వేదికగా ఆమె వెల్లడించింది.

2024లో ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీలో విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ రజతం ఖాయం చేసుకుంది. కానీ, రెండో రోజు బరువు చూసే సమయానికి 100 గ్రాములు అదనంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ ఆవేదనతో ఆమె రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.

ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఈ జూలైలో ఆమె ఒక బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కూడా ఆమె పోస్టులో పేర్కొంది. ఈసారి తాను ఒంటరిగా ప్రయాణించడం లేదని, తన జట్టులో ఇప్పుడు తన కుమారుడు కూడా ఉన్నాడని వెల్లడించింది. వాడు తనకు అసలైన ప్రేరణ అని తెలిపింది. తన లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ప్రయాణంలో తన చిట్టి చీర్ లీడర్ ఉంటాడని తెలిపింది.

వినేశ్ ఫొగాట్ మూడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంది. 2016లో ఒలింపిక్స్‌కు ఎంట్రీ ఇచ్చిన వినేశ్, అప్పుడు మోకాలి గాయంతో క్వార్టర్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2021లో భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టినప్పటికీ క్వార్టర్స్‌లో ఓడిపోయింది. 2024లో తృటిలో పతకం చేజార్చుకుంది.


More Telugu News