తన పేరు, ఫొటోల దుర్వినియోగం.. న్యాయపోరాటానికి దిగిన సునీల్ గవాస్కర్

  • తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన స‌న్నీ
  • గవాస్కర్ దావాను ఫిర్యాదుగా పరిగణించి వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాకు ఆదేశం
  • ఐటీ రూల్స్ 2021 ప్రకారం ముందుగా సంస్థలను సంప్రదించాలని సూచించిన న్యాయస్థానం
  • ఇటీవల ఇలాంటి కేసుల్లో కోర్టును ఆశ్రయించి సల్మాన్, తార‌క్‌, నాగార్జున
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన పర్సనాలిటీ, పబ్లిసిటీ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలపై తన పేరు, ఫొటోలు, పోలికలను అక్రమంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం, సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

గవాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నియమావళి) రూల్స్, 2021 ప్రకారం అధికారిక ఫిర్యాదుగా పరిగణించాలని న్యాయస్థానం సోషల్ మీడియా మధ్యవర్తులను ఆదేశించింది. ఈ ఫిర్యాదుపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అభ్యంతరకర కంటెంట్‌కు సంబంధించిన యూఆర్ఎల్ (URL) లింకులను 48 గంటల్లోగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు అందించాలని గవాస్కర్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.

ఆన్‌లైన్‌లో అభ్యంతరకర కంటెంట్‌పై చర్యలు కోరే వ్యక్తులు, ముందుగా ఐటీ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న ఫిర్యాదుల యంత్రాంగాన్ని వినియోగించుకోవాలని, ఆ తర్వాతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వేసిన ఇలాంటి కేసులోనూ ఢిల్లీ హైకోర్టు ఇదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా నటులు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ వంటి పలువురు ప్రముఖులు తమ గుర్తింపు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కోర్టుల నుంచి రక్షణ ఉత్తర్వులు పొందిన విషయం తెలిసిందే.


More Telugu News