అఖండ-2 చిత్రబృందానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

  • సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించిన హైకోర్టు డివిజన్ బెంచ్
  • డిసెంబర్ 14 వరకు కొనసాగనున్న మధ్యంతర ఉత్తర్వులు
  • తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం
  • విడుదలైన తొలిరోజే బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న సినిమా
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ-2 తాండవం' చిత్ర బృందానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో పెంచిన ధరలతో టికెట్లు విక్రయించుకునేందుకు చిత్ర యూనిట్‌కు మార్గం సుగమమైంది.

వివరాల్లోకి వెళితే, 'అఖండ-2' టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్, నిన్న ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. దీనిని సవాలు చేస్తూ చిత్ర బృందం వెంటనే డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే ఇచ్చింది.

ఈ స్టే డిసెంబర్ 14వ తేదీ వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసిన న్యాయస్థానం, తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా, నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'అఖండ-2 తాండవం' చిత్రానికి అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పాజిటివ్ రివ్యూలతో సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది.


More Telugu News