రైతులకు అండగా నిలుస్తున్న టెక్కీ.. ఫోన్ చేసి అభినందించిన మంత్రి నాదెండ్ల

  • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శంకరరావును అభినందించిన మంత్రి నాదెండ్ల మనోహర్
  • రైతులకు అందిస్తున్న సేవలను ఫోన్‌లో కొనియాడిన మంత్రి
  • సొంత ఖర్చులతో అన్నదాతలకు అండగా నిలుస్తున్న శంకరరావు
  • వడ్డీ లేకుండా లక్ష రూపాయల వరకు పెట్టుబడి సాయం
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మరడాన శంకరరావును రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అభినందించారు. శంకరరావుకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి, ఆయన రైతులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. కష్టకాలంలో అన్నదాతలకు అండగా నిలవడం అభినందనీయమని ప్రశంసించారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శంకరరావు, తన స్వగ్రామమైన వీరఘట్టం మండలం కడకెల్లలోని రైతులు పడుతున్న ఇబ్బందులను 2019లో గమనించారు. ధాన్యం అమ్ముకోవడంలో రైతు భరోసా కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలను ఆయన అధ్యయనం చేశారు. సకాలంలో గోనె సంచులు దొరకకపోవడం, వాహనాలు రాకపోవడం, కొనుగోళ్లలో జాప్యం వంటి కారణాలతో రైతులు దళారులను ఆశ్రయిస్తూ నష్టపోవడాన్ని చూశారు.

ఈ క్రమంలో రైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్న శంకరరావు, తన సొంత డబ్బులతో వారికి గోనె సంచులు అందించడం, ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. అలాగే అవసరమైన రైతులకు సుమారు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం డబ్బులు అందిన తర్వాత రైతులు ఆ మొత్తాన్ని తిరిగి శంకరరావుకు చెల్లిస్తున్నారు.

రైతుల పట్ల శంకరరావు చూపిస్తున్న చొరవ, అందిస్తున్న సేవలను తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయనను అభినందించారు. మంత్రి ప్రశంసకు శంకరరావు కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News