మోదీ తీరు పచ్చకామెర్ల సామెతలా ఉంది: వైఎస్ షర్మిల

  • ఏపీలో కూటమి పాలన భేషుగ్గా ఉందన్న ప్రధాని మోదీ
  • ప్రజల కష్టాలు కనిపించడం లేదా అంటూ షర్మిల ఫైర్
  • కూటమి పార్టీల నేతలు గొర్రెల్లా మారారని విమర్శలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో కూటమి పాలన బాగుందని ప్రధాని చెప్పడం చూస్తుంటే, పచ్చకామెర్లు సోకిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, రోగులు పడుతున్న కష్టాలు ప్రధాని మోదీకి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు.

ఈ మేరకు షర్మిల ఒక ప్రకటన విడుదల చేశారు. "గిట్టుబాటు ధర లేక రైతులు పంటలను తగలబెడుతున్నా, తుపానులతో సర్వం కోల్పోయినా ప్రభుత్వం ఆదుకోలేని నిర్లక్ష్యం ప్రధానికి కనిపించదు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక వారి కష్టాలు, ఆరోగ్యశ్రీ నిలిచిపోవడంతో రోగుల వేదన ఆయన దృష్టికి రావడం లేదు" అని ఆమె పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, హామీల అమలులో కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను, విభజన హామీలను కూటమి పార్టీలు ప్రధాని కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాయని షర్మిల దుయ్యబట్టారు. "వాళ్లు తల ఊపమంటే ఊపే గొర్రెల్లా మారారు కాబట్టే, మోదీకి కూటమి పాలన భేష్ అనిపిస్తోంది. ప్రధాని హోదాలో ఉండి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన నిజాలు దాగవు" అని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వానిది అసమర్థ పాలన అని, ఆర్భాటాలు తప్ప ఆచరణలో హామీల అమలు శూన్యమని షర్మిల విమర్శించారు. రాష్ట్రంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విభజన హామీలు అమలు చేసి, ప్రత్యేక హోదా ఇవ్వాలని, అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించాలని షర్మిల డిమాండ్ చేశారు.


More Telugu News