హైదరాబాద్ జేఎన్టీయూలో కీచక ప్రొఫెసర్.. గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రొఫెసర్ లైంగిక దాడి

  • ఉద్యోగం తీసేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారం
  • బాధితురాలి కాపురంలో నిందితుడు చిచ్చుపెట్టాడన్న ఆరోపణలు
  • పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల డిమాండ్
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో (జేఎన్టీయూ) దారుణ ఘటన వెలుగుచూసింది. తన వద్ద గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మహిళపై ఓ ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందిత ప్రొఫెసర్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిందితుడు బాధితురాలిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరింపులకు గురిచేశాడు. తామిద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారం అని నమ్మించి, పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పని పేరుతో అర్ధరాత్రి వరకు తనతోనే ఉంచుకోవడంతో బాధితురాలి వైవాహిక జీవితంలో కలతలు రేగాయి. దీంతో భర్తకు దూరంగా ఆమె ఒంటరిగా జీవించడం ప్రారంభించింది.

బాధితురాలు ఒంటరిగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న ప్రొఫెసర్, శారీరకంగా, మానసికంగా మరింత వేధించడం మొదలుపెట్టాడు. తన ఛాంబర్‌లోనే ఆమెపై అత్యాచారయత్నం చేసినట్లు కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. రోజురోజుకూ వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది.

ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News