టీన్యూస్, ఇద్దరు ఎమ్మెల్యేలకు కవిత నోటీసులు

  • మహేశ్వరరెడ్డి, మాధవరం కృష్ణారావులకు నోటీసులు
  • తనపై, తన భర్తపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపాటు
  • వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్
తెలంగాణ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఓ మీడియా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్ ఛానల్‌కు ఈ నోటీసులు జారీ అయ్యాయి. తనపైనా, తన భర్త అనిల్‌పైనా నిరాధారమైన ఆరోపణలు చేశారని, వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత ఆ నోటీసులో డిమాండ్ చేశారు.

ప్రస్తుతం కవిత "తెలంగాణ జాగృతి జనం బాట" పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ఈ యాత్రలో భాగంగా ఆమె వివిధ పార్టీల నేతలపై విమర్శలు చేస్తున్నారు. మొదట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కవిత, ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలపై దృష్టి సారించారు. నిన్న మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో పర్యటించారు.

ఈ క్రమంలోనే కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి కృష్ణారావు కూడా గట్టిగా బదులిచ్చారు. ఈ మాటల యుద్ధం నేపథ్యంలోనే ఆయనకు కవిత లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, టీ న్యూస్‌కు కూడా నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.



More Telugu News