స్వదేశంలో టీమిండియా చెత్త రికార్డు

  • దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో భారత్ ఓటమి
  • 51 పరుగుల తేడాతో చిత్తయిన టీమిండియా
  • స్వదేశంలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద పరాజయం
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముల్లన్‌పూర్‌ వేదికగా గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ జట్టు 1-1తో సమం చేసింది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించారు. భారత బౌలర్లలో ఒక్క వరుణ్ చక్రవర్తి మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత భారీ బ్యాటింగ్ లైనప్ చేతులెత్తేయడంతో 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది.

టీమిండియా పేరిట‌ చెత్త రికార్డు
ఈ ఓటమితో టీమిండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. స్వదేశంలో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద టీ20 ఓటమి కావడం గమనార్హం. గతంలో 2022లో దక్షిణాఫ్రికా చేతిలోనే 49 పరుగుల తేడాతో ఓడిన రికార్డును ఇప్పుడు సఫారీలే బద్దలుకొట్టారు. 

టీ20ల్లో టీమిండియా 5 అతిపెద్ద (పరుగుల ప‌రంగా) ప‌రాజ‌యాలివే..
ముల్లన్‌పూర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో ఓట‌మి
ఇండోర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 49 పరుగుల తేడాతో ప‌రాజ‌యం
నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓటమి
రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్ చేతిలో 40 పరుగుల తేడాతో ఓడిపోయింది
నాగ్‌పూర్‌లో శ్రీలంక చేతిలో 29 పరుగుల తేడాతో ప‌రాజ‌యం


More Telugu News