బ్రిటన్ పార్లమెంటుకు తెలంగాణ బిడ్డ.. ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’లో తొలి తెలుగు వ్యక్తి!

  • బ్రిటన్ పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ అయిన ఉదయ్ నాగరాజ్
  • ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన రికార్డు
  • నాగరాజ్‌ది సిద్దిపేట జిల్లా శనిగరం గ్రామం
  • యూకే ప్రధాని సిఫారసుతో రాజు చార్లెస్ నియామకం
తెలంగాణలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. బ్రిటన్ పార్లమెంటులోని ఎగువ సభ అయిన ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’కు ఆయన నామినేట్ అయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేసిన సిఫారసు మేరకు రాజు చార్లెస్ ఈ నియామకాన్ని ఖరారు చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం శనిగరం గ్రామం ఉదయ్ నాగరాజ్ స్వస్థలం. వరంగల్‌లో జన్మించిన ఆయన, అక్కడే ఏడో తరగతి వరకు చదువుకున్నారు. హైదరాబాద్‌లో ఇంటర్, మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లారు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు.

సాంకేతిక రంగంలో ఉన్నప్పటికీ, సమాజంపై ఆసక్తితో ఆయన రాజకీయాల వైపు అడుగులు వేశారు. పాలనా శాస్త్రంలో కూడా మాస్టర్స్ డిగ్రీ పొందారు. యూకే లేబర్ పార్టీలోని తెలుగు కమ్యూనిటీ కోసం 'మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్'ను స్థాపించి, రాజకీయ ఔత్సాహికులకు శిక్షణనిచ్చారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారిలో కొందరు మేయర్లుగా, ఇతర పదవులకు ఎన్నికవడం విశేషం. గతంలో బ్రిటన్ దిగువసభ ‘హౌస్ ఆఫ్ కామన్స్’కు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తాజాగా పాలన, ఇతర రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి వరించింది. 


More Telugu News