మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో విషాదం: లోయలో పడిన యాత్రికుల బస్సు.. 8 మంది యాత్రికులు దుర్మరణం

  • అల్లూరి జిల్లాలో యాత్రికుల బస్సు బోల్తా
  • చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో లోయలో పడ్డ బస్సు
  • భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఘటన
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన 35 మంది యాత్రికులు, ఇద్దరు డ్రైవర్లతో ఓ ప్రైవేటు బస్సు భద్రాచలంలో దర్శనం ముగించుకుని అన్నవరం బయలుదేరింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్ట వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో యాత్రికుల బంధువుల స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.


More Telugu News