సౌతాఫ్రికాతో ఓటమి.. కారణాలు చెప్పిన కెప్టెన్ సూర్యకుమార్!

  • బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమయ్యామన్న సూర్యకుమార్
  • బౌలింగ్‌లో ప్లాన్-బి లేకపోవడం దెబ్బతీసిందని అంగీకారం
  • టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా బాధ్యత తీసుకోలేకపోయామని ఆవేదన
  • ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్తామన్న కెప్టెన్
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ ఓటమికి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ వైఫల్యమే కారణమని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంగీకరించాడు. తమ ప్రణాళికలు విఫలమైనప్పుడు, ప్రత్యామ్నాయ వ్యూహాలు అమలు చేయడంలో వెనుకబడ్డామని స్పష్టం చేశాడు. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని మూడో మ్యాచ్‌లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. "మేం మొదట బౌలింగ్ చేశాం. ఈ వికెట్‌పై సరైన లెంగ్త్‌లో బంతులు వేయడంలో విఫలమయ్యాం. మా ప్లాన్-ఎ పనిచేయనప్పుడు, మా వద్ద ప్లాన్-బి సిద్ధంగా లేదు. మంచు ప్రభావం ఉన్నప్పటికీ, మేం మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది. ఈ అనుభవం మాకు ఒక పాఠం" అని తెలిపాడు.

బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. "ఛేదనలో మేం తెలివిగా ఆడలేకపోయాం. శుభ్‌మన్ గిల్, నేను జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాల్సింది. ప్రతీసారి అభిషేక్ శర్మపైనే ఆధారపడలేం. శుభ్‌మన్ తొలి బంతికే ఔటయ్యాక, నేను మరింత బాధ్యతగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాల్సింది. కానీ అలా జరగలేదు" అని సూర్యకుమార్ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు.

అక్షర్ పటేల్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై కూడా సూర్య స్పందించాడు. "గత మ్యాచ్‌లో అక్షర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ ఫామ్‌ను కొనసాగిస్తాడనే నమ్మకంతోనే అతడికి ప్రమోషన్ ఇచ్చాం. కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యూహం ఫలించలేదు" అని వివరించాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ (62) మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో భారత జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయింది.


More Telugu News