Nadendla Manohar: ఆల్ టైమ్ రికార్డ్... మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో దూసుకుపోతున్న ధాన్యం కొనుగోళ్లు

Andhra Pradesh Paddy Procurement Under Nadendla Manohar Reaches All Time High
  • డిసెంబర్ 10న ఏకంగా 1,46,607 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
  • డిసెంబర్ 11 నాటికి 20,64,673 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
  • 15 రోజుల్లోనే ఎఫ్ సీఐ కి 1,71,651 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్డ్ రైస్ సరఫరా
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS 2025-26) సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కేవలం ఒక్కరోజే, అంటే డిసెంబర్ 10న, ఏకంగా 1,46,607 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి పౌరసరఫరాల శాఖ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.

డిసెంబర్ 11 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,24,296 మంది రైతుల నుంచి మొత్తం 20,64,673 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు గాను రైతులకు ఇప్పటివరకు రూ.4,609.89 కోట్లను చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రారంభమైన కేవలం 15 రోజుల్లోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)కు 1,71,651 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) బియ్యాన్ని పంపడం ఒక చారిత్రక రికార్డుగా పౌరసరఫరాల శాఖ పేర్కొంది.

ఇటీవల కురిసిన వర్షాలు, దిత్వా తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని 106 రైస్ మిల్లులకు ఇతర జిల్లాల నుంచి ధాన్యం తరలించేందుకు ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. కొనుగోలు, రవాణా ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 32,000 లారీలు, ట్రాక్టర్లు, ప్రత్యేక రైళ్లను వినియోగిస్తున్నారు.

రైతులకు అండగా నిలవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పారదర్శక విధానాలతో కొనుగోళ్లు జరుపుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మిల్లర్లపై కఠిన నిఘా ఉంచి, రోజువారీ సమీక్షలతో ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని, రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Nadendla Manohar
Andhra Pradesh
Paddy Procurement
Kharif Marketing Season
Food Corporation of India
Custom Milled Rice
AP Agriculture
Farmers Welfare
Rice Mills
Paddy Purchase

More Telugu News