Chandrababu Naidu: చంద్రబాబు పాలనపై మోదీ ప్రశంసలు.. జగన్ విమర్శలను తిప్పికొట్టాలని ఆదేశం!

Modi Praises Chandrababus Governance Orders to Counter Jagans Criticisms
  • ఏపీ, తెలంగాణ, అండమాన్ బీజేపీ ఎంపీలతో మోదీ భేటీ
  • పెట్టుబడులు కూడా ఏపీ వైపు వెళుతుండటం హర్షణీయమని వెల్లడి
  • తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని అసంతృప్తి
  • తెలుగు ఎంపీలు జాతీయ అంశాలపై చురుగ్గా ఉండాలని దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం శుభపరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో పరిపాలనపై తనకు మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, పెట్టుబడులు కూడా ఏపీ వైపు వెళుతుండటం హర్షణీయమని, అది అభివృద్ధికి సూచిక అని ప్రశంసించారు. ఈరోజు ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, అండమాన్‌ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు అరగంట పాటు ఆయన ఎంపీలతో మాట్లాడారు.

ఈ సమావేశంలో ఏపీ బీజేపీ ఎంపీలకు మోదీ కీలక సూచన చేశారు. వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను బీజేపీ కూడా అంతే దీటుగా తిప్పికొట్టాలని ప్రధాని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సానుకూల వాతావరణం ఉందని, దానిని కాపాడుకోవాలని సూచించారు.

అదే సమయంలో, తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థంగా పోషించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "మంచి టీమ్‌ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సమస్యేంటి? పార్టీ గ్రాఫ్ పెంచుకోవడానికి మంచి అవకాశం ఉన్నా ఎందుకు విఫలమవుతున్నారు?" అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. 

తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ అంశాలపై చురుగ్గా స్పందించాలని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవాలని మోదీ సూచించారు.
Chandrababu Naidu
Narendra Modi
Andhra Pradesh
AP BJP
Jagan Mohan Reddy
YSRCP
AP Politics
Telangana BJP
BJP MPs
Political Criticism

More Telugu News