ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు షాక్.. రేపే లొంగిపోవాలని ఆదేశం!

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
  • రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బేషరతుగా లొంగిపోవాలని ఆదేశం
  • ప్రభాకర్ రావును శారీరకంగా హింసించవద్దని దర్యాప్తు బృందానికి సూచన
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ఎదుట శుక్రవారం బేషరతుగా లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి దర్యాప్తునకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని, ఆయనకు గతంలో మంజూరు చేసిన మధ్యంతర అరెస్ట్ ఉపశమనాన్ని ఎత్తివేయాలని కోరుతూ సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులో కీలకమైన ఐఫోన్‌కు సంబంధించిన క్లౌడ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఆయన రీసెట్ చేసి, సమాచారం ఇవ్వడం లేదని తమ పిటిషన్‌లో ఆరోపించారు.

సిట్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, విచారణ సందర్భంగా ప్రభాకర్ రావును శారీరకంగా హింసించవద్దని దర్యాప్తు బృందానికి ప్రత్యేకంగా సూచించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఈ కేసులో ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది.


More Telugu News