Vikram Singh Mehta: ఇండిగో బోర్డు ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Vikram Singh Mehta Apologizes for Indigo Flight Disruptions
  • విమానాల రద్దుపై క్షమాపణలు చెప్పిన ఇండిగో బోర్డు ఛైర్మన్
  • నిపుణుల బృందంతో ఘటనపై దర్యాప్తు చేస్తామన్న ఛైర్మన్  
  • డిసెంబర్ 3న ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయని వెల్లడి
విమాన సర్వీసుల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయంపై ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా స్పందించారు. వేలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాపణలు కోరారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని ఓ వీడియో ప్రకటనలో హామీ ఇచ్చారు.
 
డిసెంబర్ 3న ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయని, దానివల్ల పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని మెహతా తెలిపారు. "వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మీ అంచనాలను అందుకోలేనందుకు మమ్మల్ని క్షమించండి. జరిగినదానికి చింతిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు, సమస్య మూలాలను గుర్తించడానికి బయటి సాంకేతిక నిపుణులతో దర్యాప్తు చేయించాలని బోర్డు నిర్ణయించినట్లు వివరించారు.
 
గత వారం రోజులుగా ఇండిగో కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలాది విమానాలు రద్దు కాగా, ఒక్క బుధవారమే 220 సర్వీసులను నిలిపివేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దృష్టి సారించింది. ఇండిగో కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు 8 మంది సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, ఈరోజు (డిసెంబర్ 11) తమ ముందు హాజరు కావాలని సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను ఆదేశించింది.
 
అయితే, పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని సీఈవో పీటర్ ఎల్బర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తమపై వస్తున్న విమర్శలను స్వీకరించి, జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని మెహతా తన ప్రకటనలో పేర్కొన్నారు.
Vikram Singh Mehta
Indigo
Indigo Airlines
Flight Cancellations
DGCA
Peter Elbers
Aviation
Airline Services
India

More Telugu News