Airtel: జియో మినహా.. టారిఫ్ ధరలు పెంచిన ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్

Airtel VI BSNL Increase Tariff Prices Except Jio
  • ఇప్పటికే కొన్ని ప్లాన్ల ధరలను పెంచిన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా
  • త్వరలో 15 శాతం మేర టారిఫ్ పెంపు ఉండొచ్చని అంచనా
  • 1.5GB ప్లాన్‌పై రూ. 50 పెరిగే అవకాశం
  • వొడాఫోన్ ఐడియా వార్షిక ప్లాన్‌పై 12 శాతం భారం
దేశంలోని టెలికం వినియోగదారులపై మరోసారి టారిఫ్ భారం పడనుంది. రిలయన్స్ జియో మినహా మిగిలిన అన్ని ప్రధాన టెలికం సంస్థలు ఇప్పటికే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను సవరించడం ప్రారంభించాయి. రాబోయే మరికొన్ని వారాల్లోనే మరోసారి టారిఫ్ ధరలు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వొడాఫోన్ ఐడియా (వీఐ) తన వార్షిక ప్లాన్ అయిన రూ. 1,999పై 12 శాతం ధరను పెంచగా, 84 రోజుల వ్యాలిడిటీ గల రూ. 509 ప్లాన్‌పై 7 శాతం పెంచింది. భారతీ ఎయిర్‌టెల్ కూడా తన బేసిక్ వాయిస్ ప్లాన్ రూ. 189ని రూ. 10 పెంచి రూ. 199కి చేర్చింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొన్ని ఎంట్రీ-లెవల్ ప్లాన్ల ధరలను పెంచకుండా వ్యాలిడిటీని తగ్గించింది.

టెలికం సంస్థల ఆదాయ వృద్ధి గత నాలుగు త్రైమాసికాల్లో 14-16 శాతం ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో అది 10 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండటం, రాబోయే కొన్ని నెలల్లో పెద్ద ఎన్నికలేవీ లేకపోవడంతో డిసెంబర్‌లో టారిఫ్‌లు పెంచడానికి అనుకూల సమయమని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ఈ పెంపు సుమారు 15 శాతం వరకు ఉండొచ్చని, ముఖ్యంగా ఎక్కువ మంది వినియోగించే 1.5 జీబీ డేటా ప్లాన్‌ (28 రోజుల వ్యాలిడిటీ)పై రూ. 50 వరకు భారం పడొచ్చని పేర్కొంది.

5జీ సేవలు లేకపోవడంతో ఇప్పటివరకు తక్కువ ధరలకు ప్లాన్లు అందించిన వొడాఫోన్ ఐడియా, ఇప్పుడు ఇతర సంస్థలతో సమానంగా ధరలను సవరిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత పెంపునకు, తదుపరి పెంపునకు మధ్య 15 నెలల గ్యాప్ ఉంటుందని, ఈసారి కూడా గతంలో మాదిరిగానే ధరల పెంపు ఉంటుందని వీఐ యాజమాన్యం గతంలోనే సంకేతాలిచ్చింది.
Airtel
Airtel tariff hike
Vodafone Idea
VI tariff hike
BSNL
BSNL validity reduction
telecom tariff hike
Reliance Jio
prepaid plans
telecom industry

More Telugu News