Telangana Panchayat Elections: తెలంగాణలో తొలి విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం

Telangana Panchayat Elections First Phase Polling Begins Results Expected This Evening
  • మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 నుంచి ఓట్ల లెక్కింపు
  • 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది అభ్యర్థుల పోటీ
  • 56 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగం
  • ఇప్పటికే 396 సర్పంచ్, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవం
తెలంగాణ‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇవాళ‌ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

మొదటి విడతలో భాగంగా 4,236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా, వీటిలో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,834 సర్పంచ్ పదవుల కోసం 12,960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక గ్రామ పంచాయతీ, పది వార్డుల్లో ఎన్నికలను నిలిపివేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 56,19,430 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. మూడు విడతల కోసం కలిపి 93,905 మంది సిబ్బందిని, 3,591 మంది రిటర్నింగ్ అధికారులను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సున్నితమైన ప్రాంతాల్లోని 3,461 పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే విజేతలను ప్రకటించి, ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు.
Telangana Panchayat Elections
Telangana
Panchayat Elections
Sarpanch Elections
Village Elections
Local Body Elections
Telangana State Election Commission
Polling
Voter Turnout

More Telugu News