Amazon: భారత్‌లో అమెజాన్ మెగా ప్లాన్.. 35 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడికి రెడీ!

Amazon to Invest 35 Billion Dollars in India by 2030
  • 2030 నాటికి భారత్‌లో వందల కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్న అమెజాన్
  • ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి
  • దేశం నుంచి ఎగుమతులను 80 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యం
  • అదనంగా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళిక
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లో భారీ పెట్టుబడులకు ప్రణాళికలు ప్రకటించింది. 2030 నాటికి తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం సుమారు 35 బిలియన్ డాలర్లు (రూ. 3.14 లక్షల కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతుల వృద్ధి, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

అమెజాన్ 'సంభవ్ సమ్మిట్' సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. "అమెజాన్ ఇప్పటివరకు భారత్‌లో 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు 2030 నాటికి మా అన్ని వ్యాపారాల్లో మరో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టబోతున్నాం" అని ఆయన వివరించారు. ఈ పెట్టుబడులతో భారత్ నుంచి ఎగుమతులను ప్రస్తుతమున్న 20 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే, అదనంగా 10 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ పెట్టుబడి ప్రణాళిక, మైక్రోసాఫ్ట్ (17.5 బిలియన్ డాలర్లు), గూగుల్ (15 బిలియన్ డాలర్లు) ప్రకటించిన పెట్టుబడుల కన్నా చాలా అధికం. కీస్టోన్ నివేదిక ప్రకారం అమెజాన్ భారత్‌లో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా నిలిచింది.

ఈ పెట్టుబడుల ద్వారా ఫిజికల్, డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయనున్నట్లు అగర్వాల్ చెప్పారు. ఇందులో భాగంగా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, రవాణా నెట్‌వర్క్‌లు, డేటా సెంటర్లు, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను విస్తరించనున్నారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు ‘ఎక్స్‌పోర్ట్స్’ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీని కింద దేశంలోని సూరత్, తిరుపూర్, కాన్పూర్ వంటి 10 తయారీ క్లస్టర్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Amazon
Amazon India
Amit Agarwal
E-commerce investment India
Foreign Investment India
Make in India
Digitalization India
Exports India
Job creation India
Amazon Sambhav Summit

More Telugu News