భాగ్యనగరంలో ఫుట్‌బాల్ ఫీవర్.. మెస్సితో సెల్ఫీ దిగాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

  • హైదరాబాద్ రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి
  • ఆయనతో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే
  • ఉప్పల్‌ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్‌బాల్ ఆడనున్న మెస్సి
  • చిన్నారులకు ఫుట్‌బాల్ మెళకువలు నేర్పించనున్న అర్జెంటీనా స్టార్
  • ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
భాగ్యనగరంలో ఫుట్‌బాల్ ఫీవర్ మొదలైంది. ఎల్లుండి సాయంత్రం హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్న అర్జెంటినా దిగ్గజం లియోనల్ మెస్సి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆయనతో ఫొటో దిగాలనుకుంటే మాత్రం భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సిందే. ఒక్క ఫొటోకు దాదాపు రూ. 10 లక్షలు ఖర్చవుతుంది.‘ద గోట్ టూర్’ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతీరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.

13న సాయంత్రం నగరానికి రానున్న మెస్సితో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెస్సితో ఫొటో దిగేందుకు రూ.9.95 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించాలని, కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన టికెట్లు ‘డిస్ట్రిక్ట్’ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఉప్పల్‌లో మెస్సి వర్సెస్ రేవంత్
శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సి హైదరాబాద్ చేరుకుని, రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారు. మెస్సితో పాటు స్టార్ ఆటగాళ్లు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేయనున్నారు. సింగరేణి ఆర్‌ఆర్-9, అపర్ణ మెస్సి ఆల్ స్టార్స్ జట్ల మధ్య 20 నిమిషాల పాటు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ చివరి ఐదు నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగనున్నారు.

అనంతరం యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెస్సి చిన్నారులకు ఫుట్‌బాల్ మెళకువలు నేర్పిస్తారు. పెనాల్టీ షూటౌట్ విజేతలకు బహుమతులు అందించి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం అందుకుంటారు. దాదాపు గంట పాటు స్టేడియంలో గడిపిన తర్వాత, రాత్రికి నగరంలోనే బస చేసి ఆదివారం ఉదయం ముంబయికి బయలుదేరి వెళ్తారు. ఈవెంట్‌లో భాగంగా మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


More Telugu News