చిన్నారి గాయని సాధ్యకు సీఎం చంద్రబాబు ప్రశంస

  • 22 ప్రదర్శనల్లో 22 అవార్డులు సాధించిన చిన్నారి సాధ్య
  • తల్లిదండ్రులతో కలిసి సీఎం చంద్రబాబును కలిసిన బాల గాయని
  • హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై సత్తా చాటిన సాధ్య
  • సాధ్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్ష
  • చిన్నారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించిన ముఖ్యమంత్రి
అంతర్జాతీయ వేదికలపై చిన్నతనంలోనే శ్రావ్యంగా పాటలు పాడుతూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న గాయని సాధ్యను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం చిన్నారి సాధ్య, ఆమె తల్లిదండ్రులు స్వైరా, సిరి కృష్ణ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిశారు. చిన్నారి గాయని సాధ్య వివిధ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కించుకుందని ఆమె తల్లిదండ్రులు సీఎంకు వివరించారు. 

సోలో ప్రదర్శనలలో సాధ్య విజయాలు సాధించిందని.. యార్క్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో ఓపెరా హౌస్ వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఆమె ఏడు సార్లు ప్రథమ స్థానం, ఏడు సార్లు ద్వితీయ స్థానం, రెండు సార్లు తృతీయ స్థానాల్లో విజయం సాధించిందని ఆమె తల్లిదండ్రులు సీఎంకు తెలిపారు. వీటితో పాటు మూడు గౌరవప్రదమైన బహుమతులు, మూడు ప్రత్యేక బహుమతులు కూడా సొంతం చేసుకుందని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 22 ప్రదేశాల్లో 22 ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ పాటల పోటీల్లో పాల్గొందని... ప్రతిచోటా అవార్డులు సొంతం చేసుకుందని వివరించారు. 

అలాగే యూరో ఎలైట్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్, కెనడియన్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్, రాయల్ మాస్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్ వంటి అగ్రశ్రేణి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని సాధ్య తన ప్రతిభను చాటుకుందని సీఎం దృష్టికి ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. 

చిన్నారి సాధ్యను సంగీతంలో రాణించేలా ప్రొత్సహిస్తున్న ఆమె తల్లిదండ్రులను సీఎం అభినందించారు. కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన కాటూరు మెడికల్ కాలేజి, హాస్పటల్ అధినేత మనుమరాలైన సాధ్య మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.


More Telugu News