మీ మతంలో జరిగితే ఇలాగే స్పందిస్తారా?: జగన్‌పై పవన్ కల్యాణ్ ఫైర్

  • పరకామణి చోరీ చిన్నదన్న జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్
  • వైసీపీ హయాంలో తిరుమలలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణ
  • హిందువులు మెజారిటీ వర్గం అనడం ఒక భ్రమ అని పవన్ వ్యాఖ్య
  • అన్ని మతాలకూ చట్టం సమానంగా వర్తించాలని స్పష్టీకరణ
తిరుమల పరకామణిలో జరిగిన చోరీని చిన్న దొంగతనం అని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఇదే ఘటన మీ మతంలో జరిగి ఉంటే మీరు ఇలాగే స్పందించేవారా?" అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుందని ఉద్ఘాటించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా.. హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండవనని స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ అక్రమాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని అన్నారు. ఇటీవల పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చిందని గుర్తుచేశారు. తిరుమలలో జరిగిన అన్ని అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు.

ఈ సందర్భంగా హిందూ సమాజంపై జరుగుతున్న వివక్ష గురించి ఆయన ప్రస్తావించారు. "హిందువులు మెజారిటీ అనడం ఒక భ్రమ. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా హిందువులు విడిపోయి ఉన్నారు" అని పవన్ వ్యాఖ్యానించారు. హిందూత్వంపై విమర్శలు వస్తే సెక్యులరిజం అంటారని, అదే ఇతర మతాలపై వ్యాఖ్యలు చేస్తే ఆయా మతాల వారంతా ఏకమవుతారని అన్నారు.

తమిళనాడులో ఓ న్యాయమూర్తి హిందూ సమాజ హక్కులను కాపాడేలా తీర్పు ఇస్తే, డీఎంకే ప్రభుత్వం ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడాన్ని పవన్ తప్పుబట్టారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి, అన్ని ఆలయాలను దాని పరిధిలోకి తీసుకురావాలని ఆయన తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.


More Telugu News