Chiranjeevi: మెగాస్టార్ ను కలవడం నిజంగా సర్ ప్రైజ్: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra Meets Megastar Chiranjeevi in Surprise Hyderabad Visit
  • హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఆనంద్ మహీంద్రా
  • చిరంజీవి వినయం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి తనను ఆకట్టుకున్నాయని వెల్లడి
  • ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఈ రెండు లక్షణాలు కీలకమని వ్యాఖ్య
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్ పర్యటనలో తాను తొలిసారి చిరంజీవిని కలవడం ఒక మధురానుభూతి అని ఆయన పేర్కొన్నారు. చిరంజీవిలోని వినయం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో పాల్గొనేందుకు ఆనంద్ మహీంద్రా నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి రాష్ట్ర 'విజన్ 2047' ప్రణాళికపై చర్చించారు. ఈ పర్యటనలోనే అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశం లభించిందని ఆయన వివరించారు.

ఈ భేటీపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. "చిరంజీవి గారు ఒక లెజెండ్. ఆయనను కలవడం ఒక సర్ ప్రైజ్. కానీ, ఆయనలోని వినయం, సహజ సిద్ధమైన జిజ్ఞాస ఆయన్ను మరింత ఆత్మీయుడిగా మార్చాయి. ఆయనను కలవడం ఒక శక్తివంతమైన విషయాన్ని గుర్తుచేసింది. సినిమా, వ్యాపారం, విధాన రూపకల్పన.. ఇలా ఏ రంగంలోనైనా శాశ్వత విజయం సాధించాలంటే నేర్చుకోవాలనే జిజ్ఞాస, వినయంతో వినగలిగే నైజం పునాదుల వంటివి" అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ఫొటో కూడా పంచుకున్నారు. చిరంజీవి, ఆనంద్ ముచ్చటిస్తుండగా... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి చిరునవ్వుతో వింటూ ఉండడడం ఆ ఫొటోలో చూడొచ్చు.
Chiranjeevi
Anand Mahindra
Revanth Reddy
Telangana Rising Global Summit
Mahindra Group
Hyderabad
Tollywood
Indian Cinema
Business
Vision 2047

More Telugu News