Chandrababu: అధికారులూ.. ఆలోచనా విధానం మార్చుకోండి: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Focuses on Positive Thinking in Government
  • అధికారుల్లో ప్రతికూల ఆలోచనలు వీడాల‌న్న సీఎం చంద్ర‌బాబు
  • పనితీరుతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమ‌ని వ్యాఖ్య‌
  • జనవరి 15 నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లో ఉండాలన్న ముఖ్య‌మంత్రి
  • రెవెన్యూ, దేవాదాయ శాఖల పనితీరు మెరుగుపడాలని సూచ‌న‌
ప్రభుత్వ అధికారులు ప్రతికూల ఆలోచనలను వీడి, సానుకూల దృక్పథంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పని, ఫలితమే కాకుండా ప్రజలతో వ్యవహరించే శైలి కూడా ముఖ్యమని ఆయన హితవు పలికారు. బుధవారం అమరావతిలో శాఖాధిపతులు (హెచ్‌ఓడీలు), కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వం ఏదైనా ఆదేశం జారీ చేసినప్పుడు కొందరు అధికారులు దానిని ఎలా అమలు చేయకూడదు అనే కోణంలో ఆలోచిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని చంద్రబాబు అన్నారు. "ప్రభుత్వంలో ఏ స్థాయి అధికారి అయినా పాజిటివ్ ఆలోచనలతో పనిచేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించే విధానాన్ని అలవర్చుకోవాలి" అని ఆయన సూచించారు.

ముఖ్యంగా దేవాదాయ, రెవెన్యూ శాఖల్లో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో తెచ్చిన మార్పులు, దేవాదాయ శాఖ పరిధిలోని ప్రతి ఆలయంలోనూ కనిపించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతం చేసేందుకు, జనవరి 15వ తేదీ నాటికి అన్ని శాఖల సేవలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని డెడ్‌లైన్ విధించారు.

రాబోయే మూడు నెలల్లో అన్ని విభాగాలు ప్రజల్లో 80 శాతానికి పైగా సంతృప్తి స్థాయిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. "ప్రజలు సంతృప్తిగా లేకపోతే మనం బంగారం ఇచ్చినా ప్రయోజనం ఉండదు. మంత్రులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తే మూడు నెలల్లోనే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu
AP CM
Andhra Pradesh
Government officials
Positive attitude
Public satisfaction
Online services
Revenue department
Devadaya department
Amaravati

More Telugu News