Deepawali: యునెస్కో వార‌స‌త్వ పండుగ‌గా 'దీపావళి'.. ప్రధాని మోదీ హర్షం

May the ideals of Prabhu Shri Ram keep guiding us for eternity PM Modi on Deepawali in UNESCO list
  • యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళికి చోటు
  • భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పులకించిపోతున్నారన్న ప్రధాని
  • భారత సంస్కృతికి అపూర్వమైన గుర్తింపు లభిస్తోందన్న కేంద్ర మంత్రి షెకావత్
  • ఈ జాబితాలో చేరిన 16వ భారతీయ సాంస్కృతిక అంశంగా దీపావళి
భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగకు ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో తన 'మానవ సంస్కృతికి చెందిన వారసత్వ జాబితా' (Intangible Cultural Heritage of Humanity)లో దీపావళిని చేర్చినట్లు బుధవారం ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో స్పందిస్తూ.. "భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ వార్తతో పులకించిపోతున్నారు. దీపావళి మన సంస్కృతి, విలువలతో పెనవేసుకుపోయింది. ఇది మన నాగరికతకు ఆత్మ లాంటిది. ఈ గుర్తింపుతో దీపావళి ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుంది. శ్రీరాముడి ఆదర్శాలు మనందరినీ ఎల్లప్పుడూ నడిపించాలి" అని పేర్కొన్నారు.

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా స్పందిస్తూ, ఇది భారత్‌కు చారిత్రక దినమని అభివర్ణించారు. ప్రధాని మోదీ హయాంలో భారత సాంస్కృతిక వారసత్వానికి అపూర్వమైన అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని ఆయన అన్నారు.

మొట్టమొదటిసారిగా భారత్‌ ఆతిథ్యమిస్తున్న యునెస్కో 20వ అంతర్ ప్రభుత్వ కమిటీ సమావేశాలు ఈ నెల‌ 8 నుంచి 13 వరకు ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే దాదాపు 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను పరిశీలించి, దీపావళికి ఈ గుర్తింపునిస్తున్నట్లు యునెస్కో ప్రకటించింది. ఇప్పటివరకు ఈ జాబితాలో కుంభమేళా, దుర్గాపూజ, గుజరాత్ గర్భా, యోగా సహా 15 భారతీయ అంశాలు ఉండగా, తాజాగా దీపావళి చేరికతో ఈ సంఖ్య 16కి పెరిగింది.
Deepawali
PM Modi
UNESCO

More Telugu News