Salman Khan: తెలంగాణలో సల్మాన్ ఖాన్ ఫిల్మ్ స్టూడియో... రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

Salman Khan 10000 Crore Investment in Telangana Film Studio
  • తెలంగాణ రైజింగ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ వెంచర్స్
  • మెగా టౌన్ షిప్ నిర్మాణానికి ప్రభుత్వంతో ఒప్పందం
  • మౌలిక వసతుల కల్పనలో సహకరించేందుకు ప్రభుత్వం అంగీకారం
తెలంగాణలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేయనున్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో ఫిల్మ్ స్టూడియోతో పాటు మెగా టౌన్ షిప్ నిర్మించనున్నారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ కేవీ) తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 లో ఈ ఒప్పందం కుదిరినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
 
అత్యాధునిక వసతులు..
నివాస, వాణిజ్య, వినోద, క్రీడా సౌకర్యాలను ఒకేచోట అందించేలా సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్‌ షిప్ ను నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో గోల్ఫ్ కోర్స్, రేస్ కోర్స్, షూటింగ్ రేంజ్ వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులు ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్య భాగం కానుంది.

స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ పెట్టుబడి రాష్ట్ర సృజనాత్మక రంగానికి ఒక గొప్ప మైలురాయి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనతో పాటు తెలంగాణను ఫిల్మ్ మేకింగ్, వినోదం, లగ్జరీ పర్యాటకానికి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలపనుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Salman Khan
Salman Khan film studio
Telangana film city
Telangana Rising Global Summit 2025
Revanth Reddy
Hyderabad film industry
Bollywood investment Telangana
Mega township Telangana
Film tourism Telangana
Salman Khan Ventures

More Telugu News