Jasprit Bumrah: బుమ్రా 100వ వికెట్‌పై వివాదం.. అది నో బాల్ అంటున్న నెటిజన్లు!

Umpires Massive No Ball Blunder Hands Jasprit Bumrah 100th T20I Wicket
  • మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా
  • ఈ ఘనత సాధించిన ఐదో అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు
  • కటక్ టీ20లో బ్రెవిస్‌ను ఔట్ చేసి మైలురాయి అందుకున్న బుమ్రా
  • అయితే బుమ్రా వేసిన ఆ బంతి నో బాల్ అంటూ సోషల్ మీడియాలో వివాదం
భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) కనీసం 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. నిన్న‌ కటక్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బుమ్రా ఈ రికార్డును సాధించాడు.

ఈ మ్యాచ్‌లో 11వ ఓవర్ రెండో బంతికి దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా తన 100వ టీ20 వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. బుమ్రా వేసిన షార్ట్ బంతికి బ్రెవిస్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కింది. అయితే, ఈ డెలివరీపై నో బాల్ అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా, సుదీర్ఘ పరిశీలన తర్వాత దానిని 'ఫెయిర్ డెలివరీ'గా ప్రకటించారు. బుమ్రా పాదంలో కొంత భాగం క్రీజు వెనుకే ఉందని థర్డ్ అంపైర్ స్పష్టం చేశారు.

అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలామంది నెటిజన్లు అది స్పష్టమైన నో బాల్ అని వాదించారు. థ‌ర్డ్ అంపైర్ కూడా స‌రైన నిర్ణ‌యం ఇవ్వ‌లేద‌ని కొంద‌రు అంటున్నారు. అయితే, బెనిఫిట్ ఆఫ్ డౌట్‌లో నిర్ణ‌యం బౌల‌ర్‌కు అనుకూలంగా ఉంటుంద‌ని మ‌రికొంద‌రు పోస్టులు పెడుతున్నారు. 

మ‌రోవైపు కామెంటేటర్ మురళీ కార్తీక్ మాట్లాడుతూ కెమెరా యాంగిల్ స్పష్టంగా లేనప్పుడు బౌలర్‌కు అనుకూలంగా నిర్ణయం ఇవ్వాలని చెప్పగా, మరో కామెంటేటర్ దీనితో విభేదించారు. ఏదేమైనా ఒకవేళ ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించినా బుమ్రా రికార్డుకు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే అదే ఓవర్ ఐదో బంతికి కేశవ్ మహారాజ్‌ను కూడా ఔట్ చేసి బుమ్రా తన వికెట్ల సంఖ్యను 101కి పెంచుకున్నాడు.
Jasprit Bumrah
Bumrah
India bowler
T20 World Cup
cricket controversy
cricket news
no ball
cricket umpire
South Africa
Dewald Brevis

More Telugu News