Pinumalla Sankeerth: అమెరికాలో విషాదం: మంచులో జారిపడి హైదరాబాదీ యువకుడి మృతి

Pinumalla Sankeerth Hyderabad student dies in US accident
  • ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మల్కాజిగిరి వాసి
  • నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న మృతదేహం
  • మల్కాజిగిరిలో అంత్యక్రియలు నిర్వహించనున్న కుటుంబసభ్యులు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మల్కాజిగిరికి చెందిన పినుమళ్ల సంకీర్త్ (24) ఈ నెల 6న అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా కాలు జారి కిందపడిపోవడంతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం మీడియాకు తెలిపారు.

సంకీర్త్ తండ్రి సుధాకర్, దాచేపల్లిలోని అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండటంతో, సంకీర్త్ పదో తరగతి వరకు అక్కడి దుర్గా పబ్లిక్ స్కూల్‌లోనే చదువుకున్నాడు. ఇంటర్, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేసి, ఒహియోలోని యూనివర్సిటీ ఆఫ్ డేటన్‌లో ఎమ్మెస్ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగంలో చేరాడు. సంకీర్త్‌కు ఒక సోదరి ఉండగా, ఆమె కూడా అమెరికాలోనే ఎమ్మెస్ చదువుతోంది.

సంకీర్త్ మృతదేహాన్ని నేడు హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తండ్రి సుధాకర్ తెలిపారు. అంత్యక్రియలు మల్కాజిగిరిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంకీర్త్ మరణ వార్త తెలియగానే, దాచేపల్లిలోని ఆయన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు.
Pinumalla Sankeerth
Hyderabad
USA
Road accident
Ohio
University of Dayton
Malkajgiri
Student death
US accident

More Telugu News