Pavala Syamala: ఆత్మహత్యకు సిద్ధపడిన సినీ నటి పావలా శ్యామల.. కాపాడిన పోలీసులు

Pavala Syamala Telugu Actress Suicide Attempt Thwarted by Police
  • 300 సినిమాల్లో నటించిన పావలా శ్యామల 
  • అనారోగ్యం, అవకాశాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
  • ఆత్మహత్యకు సిద్ధపడగా గుర్తించి కాపాడిన పోలీసులు
  • తల్లీకూతుళ్లకు ఆశ్రయం కల్పించిన ఆర్కే ఫౌండేషన్
తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 300 సినిమాల్లో సహాయ నటిగా గుర్తింపు పొందిన పావలా శ్యామల దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు సిద్ధపడిన ఆమెను, ఆమె కుమార్తెను పోలీసులు కాపాడి ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు.

కొంతకాలంగా పావలా శ్యామల, ఆమె కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికితోడు సినిమా అవకాశాలు లేకపోవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ క్రమంలో కొందరు వారిని ఓ హోమ్‌లో చేర్పించగా, అక్కడ వారి ఆరోగ్యం మరింత క్షీణించి మంచానికే పరిమితమయ్యారు. సరైన సేవలు అందించలేమంటూ ఆ హోమ్ నిర్వాహకులు వారిని బయటకు పంపించేశారు.

దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైకి చేరిన శ్యామల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేశ్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఏసీపీ, వారిని కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్‌కేర్ సెంటర్‌కు తరలించారు.

ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించి, అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. తమ సంస్థ ద్వారా అనాథ వృద్ధులకు సాయం అందిస్తున్నామని, ఎవరైనా అవసరంలో ఉంటే తనను సంప్రదించాలని (9866491506) ఆయన కోరారు.
Pavala Syamala
Telugu actress
suicide attempt
financial problems
health issues
RK Foundation
Hyderabad police
assistant actress
Telugu cinema
actress rescue

More Telugu News