విశాఖ గూగుల్ డేటా సెంటర్‌పై చర్చ.. సుందర్ పిచాయ్‌తో లోకేశ్ భేటీ

  • విశాఖ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై కీలక సమీక్ష
  • ఏపీలో గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయాలని అడోబ్ సీఈవోకు వినతి
  • ఫైజర్, కేకేఆర్ పెట్టుబడులపైనా శంతను నారాయణన్‌తో చర్చలు
  • ప్రతిపాదనలను పరిశీలిస్తామన్న ఇరు సంస్థల సీఈవోలు
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ టెక్ దిగ్గజ సంస్థల సీఈవోలతో సమావేశమయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణన్‌లతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో జరిగిన సమావేశంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న 15 బిలియన్ డాలర్ల ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ఈ భారీ పెట్టుబడికి ముందుకు వచ్చినందుకు గూగుల్ బృందానికి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో రాబోతున్న డ్రోన్ సిటీలో గూగుల్ డ్రోన్ అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సుందర్ పిచాయ్, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద ఎఫ్‌డీఐ విశాఖ డేటా సెంటర్ అని ఆయన పేర్కొన్నారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కూడా పాల్గొన్నారు.

    
అనంతరం అడోబ్ సీఈవో శంతను నారాయణన్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. విశాఖలో అడోబ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) లేదా డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, శంతను నారాయణన్ డైరెక్టర్‌గా ఉన్న ఫైజర్, కేకేఆర్ వంటి సంస్థల పెట్టుబడులను కూడా ఏపీకి తీసుకురావాలని కోరారు. విశాఖలోని ఫార్మా జోన్‌లో ఫైజర్ ప్లాంట్ ఏర్పాటు, ఆరోగ్య సంరక్షణ రంగంలో కేకేఆర్ పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని విన్నవించారు. మంత్రి లోకేశ్ చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన శంతను నారాయణన్, తన సహచరులతో చర్చించి తగిన నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

   


More Telugu News