Chandrababu Naidu: రిజిస్ట్రేషన్ కాగానే ఆటో మ్యుటేషన్... రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Orders Auto Mutation After Land Registration
  • రిజిస్ట్రేషన్ కాగానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి కావాలన్న చంద్రబాబు
  • ఏడాదిలోగా రెవెన్యూ శాఖలో సంపూర్ణ ప్రక్షాళన చేపట్టాలని ఆదేశం
  • వివాదాస్పద భూముల పరిష్కార అధికారాన్ని ఆర్డీవోలకు బదలాయింపు
రాష్ట్రంలో రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే, ఎలాంటి జాప్యం లేకుండా రియల్‌టైమ్‌లో ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ పూర్తయ్యేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం భూ యజమానులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్థితికి చరమగీతం పాడాలని స్పష్టం చేశారు. రాబోయే ఏడాది కాలంలో రెవెన్యూ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, ఈ ప్రక్రియపై ప్రతినెలా తానే స్వయంగా సమీక్షిస్తానని ఆయన వెల్లడించారు.

మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలపై అధికారులు సీఎంకు వివరించారు. 

ఆర్డీవోలకు కీలక అధికారాలు

పరిపాలనలో సౌలభ్యం, వేగవంతమైన పరిష్కారం కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద భూముల జాబితా (డిస్ప్యూటెడ్ ల్యాండ్స్) నుంచి భూములను తొలగించే అధికారాన్ని ఇప్పటివరకు ఉన్న జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీవోలకు బదలాయించాలని నిర్దేశించారు. అదేవిధంగా, '22ఏ' జాబితాలో ఉన్న భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. చుక్కల భూములు, 1999 వరకు ప్రాథమిక సహకార సంఘాల వద్ద తాకట్టు పెట్టిన అసైన్డ్ భూములు, 1954 కంటే ముందు సేల్ డీడ్స్ ఉన్న బంజరు భూములను ఈ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

మున్సిపల్ పరిధిలోని 250 చదరపు గజాలలోపు అసైన్డ్ భూములను 50 శాతం బేస్ వాల్యూతో రెగ్యులరైజ్ చేయాలని, ఆక్వా కల్చర్ చేస్తున్న అసైన్డ్ భూములను సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం క్రమబద్ధీకరించాలని చెప్పారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు వెంటనే కుల ధృవీకరణ పత్రాలు అందేలా, ఆర్టీజీఎస్ డేటా ఆధారంగా ఆదాయ ధృవపత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
Chandrababu Naidu
AP Revenue Department
Land Registration
Auto Mutation
Andhra Pradesh
Land Disputes
Revenue Services
Pattadar Passbooks
Land Records
Sai Prasad

More Telugu News