Kutumba Rao: చంద్రబాబు పాలనలోనే అది సాధ్యం: పీ-4 ఫౌండేషన్ వైస్ చైర్మన్‌ కుటుంబరావు

Kutumba Rao Says Chandrababu Governance Only Way for Development
  • గత ఐదేళ్లలో ఏపీ జీఎస్డీపీకి రూ.7 లక్షల కోట్లకు పైగా నష్టం అని వెల్లడి
  • 18 నెలల చంద్రబాబు పాలనలోనే ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుందన్న కుటుంబరావు
  • జగన్ దుర్మార్గ పాలన వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శలు
  • చంద్రబాబు నాయకత్వంలోనే స్వర్ణాంధ్ర సాధ్యమని వెల్లడి
గత ఐదేళ్ల విధ్వంసకర పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బయటపడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తిరిగి వికాస పథంలోకి ప్రవేశించిందని స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ వైస్ చైర్మన్‌ సి.కుటుంబరావు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలను వెల్లడించారు. చంద్రబాబు వెల్లడించిన ఆర్థిక గణాంకాలే రాష్ట్ర పురోగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే స్వర్ణాంధ్ర సాధ్యమని అన్నారు.

2019-2024 మధ్య జగన్ పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)కి రూ.7 లక్షల కోట్లకు పైగా తీవ్ర నష్టం వాటిల్లిందని కుటుంబరావు ఆరోపించారు. ప్రతి ఏటా లక్ష నుంచి లక్షన్నర కోట్లు పెరగాల్సిన జీఎస్డీపీ తగ్గిపోవడంతో, రాష్ట్ర సొంత ఆదాయంలో రూ.70 వేల కోట్లకు పైగా కోత పడిందన్నారు. గత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే, ఖజానాకు అదనంగా రూ.72 వేల కోట్లు వచ్చి ఉండేవని ఆయన విశ్లేషించారు.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చినప్పుడు ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వివరించారు. 2014-19 మధ్య ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 13.21 శాతం ఉండగా, తెలంగాణది 13.5 శాతం అని, దాదాపు సమానంగా ఉన్నాయని తెలిపారు. కానీ, 2019-24 మధ్య జగన్ పాలనలో ఏపీ వృద్ధి రేటు 9.1 శాతానికి పడిపోగా, తెలంగాణ 11 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొన్నారు. దీని ఫలితంగా ఏపీ తలసరి ఆదాయం రూ.2.66 లక్షల వద్దే ఆగిపోగా, తెలంగాణ రూ.3.87 లక్షలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారని కుటుంబరావు ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో 34-35 శాతం జీఎస్డీపీ లక్ష్యంలో ఇప్పటికే 65 శాతం చేరుకున్నామని, పరిశ్రమల రంగంలో 45 శాతం లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. ఐటీ, టూరిజం, లాజిస్టిక్స్ వంటి సేవల రంగం నిర్దేశిత లక్ష్యాన్ని మించి రాణించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడం, ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్‌ను క్రమబద్ధీకరించడం వంటి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన వంటి కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వలేదని, పునరుత్పాదక ఇంధన సంస్థలను బ్లాక్‌మెయిల్ చేసి, పరిశ్రమలను బెదిరించి తరిమేశారని కుటుంబరావు తీవ్రంగా విమర్శించారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని, గ్రీన్ ఎనర్జీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. విమానయాన రంగంలో అత్యధిక వృద్ధి, మైనింగ్, గ్రానైట్ ఉత్పత్తిలో పెరుగుదల వంటివి ప్రభుత్వ విజయాలకు నిదర్శనమన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ మాదిరిగా, రాష్ట్రంలో చంద్రబాబు తన దార్శనికత, పటిష్ఠమైన నాయకత్వంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్నారని ఆయన కొనియాడారు.
Kutumba Rao
Chandrababu Naidu
Andhra Pradesh economy
AP GSDP
Telangana GSDP
Jagan Mohan Reddy
Swarna Andhra
AP logistics
AP investments
Green energy

More Telugu News