Rahul Gandhi: ఈసీని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: లోక్‌సభలో రాహుల్ గాంధీ

Rahul Gandhi Slams BJP Government on Election Commission Misuse
  • ఈసీని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న రాహుల్
  • ఓట్ల చోరీపై ఆధారాలు ఇచ్చినా ఈసీ స్పందించలేదని ఆరోపణ
  • ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శ
  • దేశంలోని వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌ కబ్జా చేస్తోందని వ్యాఖ్య
ఎన్నికల కమిషన్ (ఈసీ)ను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఈసీ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) తప్పు చేసినా శిక్ష పడకుండా చట్టాలను మార్చారని రాహుల్ విమర్శించారు. ఓట్ల దొంగతనంపై తాము ఎన్నో ఆధారాలు సమర్పించినా ఈసీ నుంచి కనీస స్పందన కరువైందని మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగానే ఎన్నికల షెడ్యూళ్లను ప్రకటిస్తున్నారని, పోలింగ్ ముగిసిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేయాలనే నిబంధన ఎందుకని ఆయన ప్రశ్నించారు. హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్‌కు 23 ఓట్లు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓటర్ల జాబితాలను ఎలా తారుమారు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ మూడు కీలక ప్రశ్నలు సంధించారు.

1. సీఈసీ స్వయంప్రతిపత్తి ఎందుకు బలహీనపడుతోంది? దాని స్వతంత్రతను నిర్ధారించే యంత్రాంగాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తుందా?

2. ఎస్ఐఆర్ ప్రక్రియలపై అనేక రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతున్న సమయంలో, ఓటర్ల జాబితాలను తారుమారు చేయకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

3. ఈసీ నియామకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ విషయంలో పారదర్శక సంస్కరణలు చేపట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా?... అని ప్రశ్నించారు.

Rahul Gandhi
Election Commission of India
ECI
Lok Sabha
BJP
democracy
election reforms
voter list
Chief Election Commissioner
CEC

More Telugu News