Sunil Kumar: విచారణకు డుమ్మా కొట్టి గోల్ఫ్ ఆడుతున్నారా?: సునీల్ కుమార్‌పై రఘురామ ఫైర్

Sunil Kumar Accused of Playing Golf Instead of Attending Inquiry
  • విచారణకు అనారోగ్యం సాకు చెప్పారంటూ రఘురామ వ్యాఖ్యలు
  • గోల్ఫ్ ఆడుకుంటూ సంతోషంగా ఉన్నారని ఆరోపణ
  • ఈ నెల 15న తప్పనిసరిగా విచారణకు రావాలని డిమాండ్
  • తన కేసును సుప్రీంకోర్టు కొట్టివేయలేదని స్పష్టీకరణ
  • మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ బెయిల్ కోసం ప్రయత్నాలు
  • బెయిల్ వస్తుందని తాను అనుకోవడం లేదన్న రఘురామ
తన కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ తీరుపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు హాజరుకాకుండా తప్పించుకునేందుకు బంధువుల అనారోగ్యం అనే సాకు చెబుతున్నారని, కానీ వాస్తవానికి ఆయన గోల్ఫ్ ఆడుకుంటూ సంతోషంగా గడుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కిడ్నీకి లేజర్ చికిత్స అనంతరం కోలుకుంటున్న రఘురామ, నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుకున్న సునీల్ కుమార్, తన బంధువులను చూసుకునేందుకు వెళ్లాల్సి ఉందని చెప్పి గడువు కోరారని రఘురామ తెలిపారు. అయితే, తనకు అందిన సమాచారం ప్రకారం ఆయన ఆఫీసర్స్ గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ ఆడుతున్నారని ఆరోపించారు. "ఒకవేళ తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కోవడానికి భయపడటం ఎందుకు? సాకులు చెబుతూ ఎందుకు తప్పించుకుంటున్నారు?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ నెల 15వ తేదీన జరగబోయే విచారణకు సునీల్ కుమార్ కచ్చితంగా హాజరు కావాల్సిందేనని రఘురామ డిమాండ్ చేశారు.

బెయిల్ కోసం మరో అధికారి ప్రయత్నాలు
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ గురించి కూడా రఘురామ ప్రస్తావించారు. తనను హింసిస్తున్న సమయంలో సునీల్ నాయక్ పక్క గదిలో కూర్చొని పర్యవేక్షించారని 164 స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నట్లు గుర్తుచేశారు. ఇటీవల బీహార్ హైకోర్టు నుంచి పొందిన ప్రొటెక్షన్ రద్దు కావడంతో, సునీల్ నాయక్ గుంటూరులోని సెకండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇది ఆయన తప్పు చేశారనడానికి నిదర్శనమని, ఆయనకు బెయిల్ వస్తుందని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు కేసును కొట్టేయలేదు
కొందరు తన కేసును సుప్రీంకోర్టు కొట్టేసిందని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. తాను బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, సీబీఐ విచారణ కోసం ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని మాత్రమే సుప్రీంకోర్టు సూచించిందని, కేసును ఎక్కడా కొట్టివేయలేదని స్పష్టం చేశారు. తనపై జరిగిన హింస వాస్తవమేనని సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రి నివేదిక స్పష్టంగా ధృవీకరించిందని ఆయన పునరుద్ఘాటించారు.

కుల రాజకీయాలపై ఘాటు స్పందన
సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ చేసిన రాజకీయ వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి పదవి కాపులకు ఇవ్వాలంటే దళిత పంచాయతీ జరగాలంటూ వ్యాఖ్యానించిన సునీల్ కుమార్, కేవలం ముగ్గురు దళిత నేతల పేర్లనే ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఆ ముగ్గురే దళితులా? మీ సామాజిక వర్గానికి చెందిన వారే దళితులా?" అని ప్రశ్నించారు. మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ లేఖను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు. 

ఇక, హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమాకు అడ్డంకులు తొలగి, ఈ నెల 12న విడుదల కానుండటం సంతోషంగా ఉందని రఘురామ తెలిపారు.
Sunil Kumar
Raghurama Krishnam Raju
IPS Sunil Kumar
Custodial torture case
AP Assembly
Golf
Sunil Nayak
Bail application
Supreme Court
CBI investigation

More Telugu News