Bai Tianhui: చైనాలో అవినీతికి ఉరి.. రూ.1,300 కోట్ల లంచం తీసుకున్న అధికారికి మరణశిక్ష

China Executes Bai Tianhui in Bribery Case
  • భారీ అవినీతి కేసులో మాజీ అధికారికి చైనాలో మరణశిక్ష
  • అధ్యక్షుడు జిన్‌పింగ్ అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా కఠిన శిక్ష
  • సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మంగళవారం శిక్ష అమలు
అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న చైనా ప్రభుత్వం, మరో ఉన్నతాధికారికి మరణశిక్ష అమలు చేసింది. ప్రభుత్వ ఆధీనంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్‌ను ఈరోజు ఉరితీసినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. సుమారు 156 మిలియన్ డాలర్లకు పైగా (భారత కరెన్సీలో దాదాపు రూ.1,300 కోట్లు) లంచం తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు రుజువయ్యాయి.

వివరాల్లోకి వెళితే, చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (CHIH) మాజీ జనరల్ మేనేజర్ బాయ్ తియాన్‌హుయ్‌పై భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2014 నుంచి 2018 మధ్య కాలంలో పలు ప్రాజెక్టుల కొనుగోలు, ఫైనాన్సింగ్ విషయాల్లో అనుకూలంగా వ్యవహరించినందుకు ఆయన భారీ మొత్తంలో లంచాలు స్వీకరించినట్లు తేలింది. ఈ కేసులో తియాన్జిన్‌లోని ఓ కోర్టు ఈ ఏడాది మే నెలలో అతనికి మరణశిక్ష విధించింది.

సాధారణంగా చైనాలో అవినీతి కేసుల్లో మరణశిక్ష విధించినా, రెండేళ్ల తర్వాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తుంటారు. కానీ, బాయ్ తియాన్‌హుయ్ విషయంలో శిక్షను నేరుగా అమలు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఆయన పైకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ, అక్కడా వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం పీపుల్స్ కోర్టు కూడా ఈ తీర్పును సమీక్షించి, శిక్షను ఖరారు చేసింది.

"బాయ్ చేసిన నేరాలు అత్యంత తీవ్రమైనవి. ఆయన తీసుకున్న లంచం చాలా పెద్ద మొత్తం. దీనివల్ల దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ పేర్కొంది. మంగళవారం ఉదయం తియాన్జిన్‌లో కుటుంబ సభ్యులతో చివరిసారిగా భేటీ అయిన అనంతరం బాయ్ కి మరణశిక్షను అమలు చేశారు.

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అవినీతి నిర్మూలనపై దృష్టి సారించినప్పటి నుంచి హువారోంగ్ సంస్థ అధికారులే లక్ష్యంగా దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇదే సంస్థ మాజీ ఛైర్మన్ లాయ్ జియామిన్‌ను కూడా 2021 జనవరిలో 253 మిలియన్ డాలర్ల లంచం కేసులో ఉరితీశారు. ఈ కఠిన చర్యలు స్వచ్ఛమైన పాలన కోసమేనని ప్రభుత్వం చెబుతుండగా, తన రాజకీయ ప్రత్యర్థులను తొలగించుకోవడానికే జిన్‌పింగ్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
Bai Tianhui
China
corruption
death penalty
bribe
Huayong International Holdings
Xi Jinping
Laxity in
anti corruption campaign
Chinese official

More Telugu News