West Bengal: బెంగాల్‌లో బీఎల్ఓలకు బెదిరింపులు... ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

West Bengal BLOs Face Threats Supreme Court Remarks on SIR
  • ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో కొనసాగాల్సిందేనన్న సుప్రీంకోర్టు
  • అధికారులకు బెదిరింపులు రావడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు
  • బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి మార్గాలు చూడాలని సూచన
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా కొనసాగించాల్సిందేనని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, ఆ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ నిర్వహణలో ఎదురవుతోన్న పరిస్థితులను పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

పిటిషన్లపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగమైన బీఎల్ఓ (బూత్ లెవల్ అధికారులు), ఇతర అధికారులకు బెదిరింపులు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిని తమ దృష్టికి తీసుకురావాలని లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. బీఎల్ఓలకు బెదిరింపులు వస్తే, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరించాలని సూచించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఎటువంటి అవాంతరాలు ఏర్పడినా అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలియజేసింది.
West Bengal
Supreme Court
Electoral Roll
Special Summary Revision
Booth Level Officers

More Telugu News