Vemula Prashanth Reddy: తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి

Telangana Faces Conspiracy to be Handed Over to Andhra Leaders Says Vemula Prashanth Reddy
  • కేసీఆర్ సాధించిన తెలంగాణ దోపిడీ దొంగల పాలైందన్న వేముల
  • రాష్ట్రంలో రాక్షసుల, రాబందుల పాలన కొనసాగుతోందని మండిపాటు
  • వేల కోట్ల విలువైన భూములు అమ్మడమే సీఎం పని అని ఆరోపణ
కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు తిప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కీలకమైన రోజున ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కష్టపడి సాధించుకున్న తెలంగాణ నేడు దోపిడీ దొంగల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అమ్మే పనిలో నిమగ్నమయ్యారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అభివృద్ధి చేసిన తెలంగాణను మళ్లీ ఆంధ్ర నాయకుల చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని, ప్రజలు ఈ కుట్రలను గమనించి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. 

నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో జరిగిన 'విజయ్ దివస్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో అనేక పోరాటాల తర్వాత తెలంగాణ సాకారమైందని, ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. "కేసీఆర్ కడుపులో పెట్టుకుని కాపాడుకున్న తెలంగాణను 'ఈన కాచి నక్కల పాలు' చేసినట్లుగా దోపిడీ దొంగలకు అప్పగించారు. రాష్ట్రంలో రాక్షసుల, రాబందుల పాలన కొనసాగుతోంది" అని మండిపడ్డారు. సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

Vemula Prashanth Reddy
Telangana
Revanth Reddy
KCR
BRS
Congress
Telangana Politics
Land Scam
Andhra Leaders
Bheemgal

More Telugu News