Saptagiri Prasad: దోచుకున్న లక్ష కోట్లు రిటర్న్ ఇవ్వండి... జగన్‌కు టీడీపీ నేత సవాల్

TDP Leader Saptagiri Prasad Alleges Corruption at Tirumala Under Jagan Government
  • తిరుమలను జగన్ ప్రభుత్వం అవినీతి కేంద్రంగా మార్చేసింద‌న్న సప్తగిరి ప్రసాద్
  • పరకామణి చోరీ కేసులో సీఎంఓ జోక్యంతో సెటిల్‌మెంట్
  • రూ. 240 కోట్ల దోపిడీలో పెద్ద నేతల పాత్ర ఉందని ఆరోపణలు
  • అవినీతిపై చర్చకు రావాలని జగన్‌కు బహిరంగ సవాల్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో అవినీతి కేంద్రంగా మార్చేసిందని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. తిరుమల పరకామణిలో జరిగిన డాలర్ల చోరీ వెనుక అసలు సూత్రధారులు వేరే ఉన్నారని, ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) జోక్యం చేసుకుని సెటిల్‌మెంట్ చేసిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిథి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

పరకామణిలో డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, సీఎంఓ జోక్యంతో రాజీ కుదిర్చారని సప్తగిరి ఆరోపించారు. సుమారు రూ. 240 కోట్ల విలువైన సొమ్మును కాజేసిన ఈ కేసులో కేవలం రూ. 14 కోట్లను గిఫ్ట్ రూపంలో రాయించుకుని కేసును నీరుగార్చారని విమర్శించారు. మిగిలిన వందల కోట్ల రూపాయలను వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ గిఫ్ట్ డీడ్‌పై కేవలం ఛైర్మన్ ఒక్కరే సంతకం చేయడంపై హైకోర్టు కూడా అప్పట్లో ప్రశ్నించిందని గుర్తుచేశారు.

తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ జరుగుతోందని, ఈ కేసులో జగన్ సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారని సప్తగిరి ఆరోపించారు. పెద్ద తలలను కాపాడేందుకు చిన్న ఉద్యోగులను బలిపశువులను చేశారని విమర్శించారు. లడ్డూ ప్రసాదం తయారీ నుంచి ఇంజనీరింగ్ పనుల వరకు ప్రతీ దాంట్లోనూ అవినీతి జరిగిందన్నారు.

గరుడ వారధి నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ జగన్ చేసిన విమర్శలను సప్తగిరి ప్రసాద్ తిప్పికొట్టారు. చంద్రబాబు హయాంలో 80 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుపై, ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను బెదిరించి ఎన్నికల నిధులు వసూలు చేయలేదని వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేయగలరా అని జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమనలకు సవాల్ విసిరారు. రవికుమార్ పశ్చాత్తాపంతో డబ్బు తిరిగి ఇచ్చినట్లు, జగన్ కూడా దోచుకున్న లక్ష కోట్లు ప్రజలకు తిరిగిస్తే పుణ్యం దక్కుతుందని ఎద్దేవా చేశారు.
Saptagiri Prasad
TDP
Tirumala
YS Jagan
YV Subba Reddy
Bhumana Karunakar Reddy
TTD scam
Andhra Pradesh politics
corruption allegations
Tirumala dollars theft

More Telugu News