Donald Trump: భారత బియ్యంపై ట్రంప్ సుంకాల వార్నింగ్.. భారం అమెరికన్లకే అంటున్న ఎగుమతిదారులు!

Trumps Rice Tariff Warning Impacts US Consumers Not India
  • ఇప్పటికే దిగుమతి బియ్యంపై 40 శాతం సుంకం విధిస్తున్న అమెరికా
  • అయినా తగ్గని బియ్యం ఎగుమతులు
  • పెరిగిన సుంకాలను వినియోగదారులపై వేస్తున్న అక్కడి రిటైలర్లు
భారత్‌తో సహా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ హెచ్చరికల వల్ల భారత బియ్యం ఎగుమతులపై, ముఖ్యంగా బాస్మతిపై పెద్దగా ప్రభావం ఉండదని, అంతిమంగా ఈ భారం అమెరికా వినియోగదారులపైనే పడుతుందని భారత బియ్యం ఎగుమతిదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ తన ప్రకటనలో భారత్‌తో పాటు వియత్నాం, థాయ్‌లాండ్ పేర్లను కూడా ప్రస్తావించారని, ఆ దేశాలు కేవలం నాన్-బాస్మతి బియ్యాన్ని మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తాయని ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అజయ్ భల్లోటియా గుర్తుచేశారు. దీనివల్ల ట్రంప్ ప్రధానంగా నాన్-బాస్మతి బియ్యం గురించే మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోందని ఆయన విశ్లేషించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ నుంచి సుమారు 2.74 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి కాగా, నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులు కేవలం 61 వేల టన్నులు మాత్రమే ఉన్నాయి.

ఇప్పటికే భారత బియ్యంపై అమెరికాలో 40 శాతం వరకు సుంకం ఉందని, అయినా ఎగుమతులు తగ్గలేదని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (IREF) తెలిపింది. పెరిగిన సుంకాల భారాన్ని ఎగుమతిదారులు కాకుండా అక్కడి రిటైలర్లు వినియోగదారులకు బదిలీ చేస్తున్నారని పేర్కొంది. భారత బాస్మతి బియ్యానికి ఉండే ప్రత్యేకమైన సువాసన, రుచి, పొడవు వంటి లక్షణాలు అమెరికాలో పండే బియ్యానికి ఉండవని, దానికి ప్రత్యామ్నాయం లేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ముఖ్యంగా బిర్యానీ వంటి వంటకాలకు బాస్మతి తప్పనిసరి అని, అందుకే ధర పెరిగినా డిమాండ్ తగ్గదని వివరించింది.

భారత బియ్యం ఎగుమతి పరిశ్రమ కేవలం అమెరికాపైనే ఆధారపడలేదని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం, ఎగుమతిదారులు కలిసి కొత్త మార్కెట్లను అన్వేషించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, కాబట్టి ట్రంప్ నిర్ణయం వల్ల భారత పరిశ్రమకు పెద్దగా నష్టం వాటిల్లకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. 
Donald Trump
Indian rice exports
Basmati rice
US tariffs
Rice exporters association
Non-basmati rice
Rice import
India rice
Rice price
American consumers

More Telugu News