Chandrababu Naidu: రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... 5.74 లక్షల ఎకరాల రికార్డుల పునఃపరిశీలనకు ఆదేశం

Chandrababu Reviews Revenue Department Focus on Land Records
  • ఫ్రీహోల్డ్ కింద ఉన్న 5.74 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పునఃపరిశీలన
  • గత ప్రభుత్వ నిర్ణయంపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు
  • రెవెన్యూ శాఖపై సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ
  • 2.77 కోట్ల కుల ధృవపత్రాలను ఆధార్‌తో అనుసంధానం
  • భూ రికార్డుల అప్‌డేషన్‌, సర్వే ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించిన అసైన్డ్ భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను క్షుణ్ణంగా పునఃపరిశీలించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం అమరావతిలో రెవెన్యూ శాఖ పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫ్రీహోల్డ్ విధానంతో పాటు 22ఏ (బి-ఫారం) రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు.

ప్రభుత్వ పనితీరులో ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రీవెన్స్‌ల పరిష్కార నివేదికను సీఎం ముందుంచారు. గతేడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు తమ శాఖకు మొత్తం 5,28,217 ఫిర్యాదులు అందాయని, వాటిలో ఇప్పటికే 4,55,189 పరిష్కరించామని అధికారులు సీఎంకు వివరించారు. మరో 73 వేల ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి పాలనా సంస్కరణలు, ఆటోమేషన్ ప్రక్రియల కారణంగా గ్రీవెన్స్‌ల పరిష్కారం గణనీయంగా వేగవంతమైందని అధికారులు పేర్కొన్నారు.

భూముల రీసర్వే, 22ఏ జాబితాకు సంబంధించిన పురోగతిని అధికారులు చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలోని 6,693 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి చేసి, వివరాలను వెబ్ ల్యాండ్ 2.0 పోర్టల్‌లో నమోదు చేశామని తెలిపారు. రీసర్వేలో పొరపాట్లకు తావులేకుండా రికార్డుల అప్‌డేషన్ ప్రక్రియలు చేపట్టామని, ఇది భూ సంబంధిత సమస్యలను తగ్గించడానికి దోహదపడుతుందని వివరించారు. 

అదేవిధంగా, 22ఏ జాబితా నుంచి భూములను తొలగించాలని కోరుతూ జూన్ నుంచి ఇప్పటివరకు 6,846 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎక్స్-సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954కు ముందు అసైన్డ్ భూములు పొందిన వారి భూములను నిబంధనల ప్రకారం 22ఏ జాబితా నుంచి మినహాయించినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత పెంచేందుకు రాష్ట్రంలో 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలను ఆధార్‌తో అనుసంధానిస్తున్నట్లు అధికారులు చెప్పగా, సీఎం అభినందించారు. దీనివల్ల అనర్హులను గుర్తించడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇదే సమయంలో, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.10,169 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లక్ష్య సాధనకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. 

సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భూ రికార్డుల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. డిజిటల్ ప్రక్రియలను వేగవంతం చేయడం ద్వారా భూ సంబంధిత వివాదాలను తగ్గించి, పేదలకు వారి హక్కులు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనాన్ని, సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ సంస్కరణలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Revenue Department
Land Records
Assigned Lands
Freehold Rights
Land Resurvey
Webland 2.0
Grievance Redressal
Caste Certificates

More Telugu News